భారతీయ రైల్వే చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పటికే వందేభారత్ రైళ్లు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారతీయ రైల్వే, వచ్చే ఏడాది మార్చిలో హైడ్రోజన్ రైలును పరుగులు తీయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు అవసరమైన బోగీలు, ఇంజన్‌ను చెన్నైలోని ఐసీఎఫ్ తయారు చేస్తోంది. వందేభారత్ రైళ్లు తయారు చేసి ఔరా అనిపించుకున్న ఐసీఎఫ్ కర్మాగారానికే హైడ్రోజన్ ఇంజన్ రైలు తయారు చేసే బాధ్యతను రైల్వే శాఖ అప్పగించింది.ఈ రైలు గంటకు 140 కి.మీ వేగంతో ప్రయాణం చేసేలా రూపొందిస్తున్నారు.
రాబోయే రెండేళ్లలో 35 హైడ్రోజన్ రైళ్లు తయారు చేయించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ బాధ్యతను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించింది. మొదటి హైడ్రోజన్ రైలు తయారీకి రూ.118 కోట్లు విడుదల చేసింది. ఒక్కో రైలు తయారీకి రూ.80 కోట్లు అవుతుందని మొదటి రైలు తయారీకి కొంత ఎక్కువ ఖర్చు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
జర్మనీలో 2018 నుంచి హైడ్రోజన్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. విద్యుత్, డీజిల్ ఇంజన్ రైళ్లతో పోల్చుకుంటే హైడ్రోజన్ రైళ్లు ఎలాంటి కాలుష్యాన్ని విడుదల చేయవు. ఈ రైళ్లు గంటకు 40 లీటర్ల నీటిని ఉపయోగించుకుంటాయి. భారత్ తయారు చేసే హైడ్రోజన్ రైలు పది బోగీలతో ముందుగా నడవనుంది. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1000 కి.మీ ప్రయాణిస్తుంది.
2030 నాటికి భారత ఇంధన అవసరాల్లో సగం రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా తయారు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది. ఇందులో భాగంగా 2030 నాటికి 500 గిగావాట్ల పునర్వినియోగ ఇంధన వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది.