మహారాష్ట్ర ఎన్నికల్లో అణుశక్తినగర్ నియోజకవర్గం నుంచి పోటీ ఎన్‌సిపి (శరద్‌పవార్) అభ్యర్ధిగా పోటీ చేసిన ఫహాద్ అహ్మద్, ఎన్‌సిపి (అజిత్‌పవార్) అభ్యర్ధి సనా మలిక్ చేతిలో 3300 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయాడు. దాంతో ఫహాద్ అహ్మద్, అతని భార్య స్వరాభాస్కర్ ఇద్దరూ తమ ఓటమిని ఈవీఎంల మీదకు నెట్టేసారు.
ఫహాద్ ఓటమి ఖాయమైన వెంటనే ఆ దంపతులిద్దరూ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కౌంటింగ్‌లో కొన్ని రౌండ్ల వరకూ తానే ఆధిక్యంలో ఉన్నాననీ, తర్వాత 99శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్న ఈవీఎంలు లెక్కించడం మొదలుపెట్టారనీ, అప్పటినుంచీ ఫలితాలు అనూహ్యంగా మారిపోయాయనీ ఫహాద్ అహ్మద్ చెప్పుకొచ్చాడు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసాడు. రీకౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తానన్నాడు.
ఇంక తనను తను సామాజిక కార్యకర్తగా చెప్పుకునే స్వరాభాస్కర్ తన భర్తతో గొంతు కలిపింది. ఓట్ల లెక్కింపులో 16, 17, 18 రౌండ్లలో తన భర్త ఫహాద్ అహ్మద్ ఆధిక్యంలో ఉన్నాడని, ఆ తర్వాతి ఈవీఎంలు లెక్కించినప్పుడు ఫలితాలు మారిపోయాయనీ స్వర చెప్పుకొచ్చింది. ఆ ఈవీఎంలు 99శాతం చార్జింగ్‌తో ఉన్నాయనీ, వాటిని లెక్కించినప్పుడే ప్రత్యర్థి ఆధిక్యంలోకి వచ్చిందనీ ఆరోపించింది. పోలింగ్ రోజంతా పనిచేసిన ఈవీఎంలలో ఇవాళ్టికి 99శాతం చార్జింగ్ ఎలా ఉందని, వాటిలో నమోదైన ఓట్లన్నీ బీజేపీ-మిత్రపక్షాలకే ఎలా వచ్చాయనీ స్వర తన ఎక్స్ పోస్ట్‌లో ట్వీట్ చేసింది.
ఈ ‘99శాతం ఛార్జింగ్ ఈవీఎంలు’ అన్న ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. గత నెలలోనే అలాంటి ఆరోపణలను ఎన్నికల సంఘం తిప్పికొట్టింది. ఆ ఛార్జింగ్ గురించి ఈ విధంగా వివరణ ఇచ్చింది.
ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్లలో ఆల్కలీన్ బ్యాటరీలు ఉపయోగిస్తారు. ఎన్నికల సమయంలో కొత్త బ్యాటరీలకు ఆర్డర్ ఇచ్చారు. వాటిని అభ్యర్ధులు లేక వారి ఏజెంట్ల ముందు ప్రదర్శించి, వారు ఒప్పుకున్న తర్వాతనే ఈవీఎంలలో అమర్చి, ఆ తర్వాతే ఈవీఎంలను సీల్ చేసారు.
బ్యాటరీలో 7.5 నుంచి 8 వోల్టుల విద్యుచ్ఛక్తి ఉంటుంది. వోల్టేజీ 7.4కంటె ఎక్కువ ఉంటే బ్యాటరీ 99శాతం ఉన్నట్లు చూపిస్తుంది. ఓటింగ్ జరిగే కొద్దీ బ్యాటరీ ఛార్జి వినియోగం అవుతుంది. క్రమంగా బ్యాటరీ చార్జి తగ్గుతూ ఉంటుంది. బ్యాటరీలో 5.8వోల్టుల విద్యుచ్ఛక్తి ఉన్నంత వరకూ ఈవీఎం పనిచేస్తుంది. బ్యాటరీ చార్జి 10శాతానికి చేరుకోడానికి ముందునుంచీ కంట్రోల్ యూనిట్ మీద ‘లో బ్యాటరీ’ అనే హెచ్చరిక వస్తూ ఉంటుంది.
ఓట్ల లెక్కింపు రోజు బ్యాటరీ సామర్థ్యం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి కంట్రోల్ యూనిట్ మీద నిర్వహించిన మాక్ పోలింగ్, అసలైన పోలింగ్, బ్యాటరీ ప్రాథమిక వోల్టేజీ.
బ్యాటరీ ఛార్జింగ్‌ని బట్టి ఓట్లు మారిపోవు. ఓట్ల లెక్కింపులో మార్పులు రావు. బ్యాటరీ ఛార్జింగ్, కంట్రోల్ యూనిట్లో ఉండే బ్యాటరీ సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంతేతప్ప, ఓట్లకూ దానికీ ఏ సంబంధమూ ఉండదు.
ఎన్నికల సంఘం అంత స్పష్టంగా బ్యాటరీ గురించి వివరణ ఇచ్చినా, అవే అబద్ధాలను ప్రచారం చేయడం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు అలవాటుగా మారిపోయింది. పైకి ఉదారవాదినని చెప్పుకుంటూ ముస్లిం ముసుగులో ఓట్లు అడుక్కున్న స్వరాభాస్కర్, ఆమె భర్త సైతం అదే పద్ధతిలో తమ ఓటమిని ఈవీఎంల మీదకు నెట్టేసారు.