ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతల్లో జోష్ నింపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి హవా కొనసాగింది. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి విజయఢంకా మోగించింది. ఇక దేశ వ్యాప్తంగా 48 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది.32 అసెంబ్లీ సీట్లను బీజేపీ కూటమి గెలుచుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 7 సీట్లు బీజేపీ, ఆర్‌ఎల్‌డీ కూటమి గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఎంసీ ఆరు సీట్లు గెలుచుకుంది. పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 2 స్థానాలను ఆప్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజస్థాన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 5 సీట్లు నెగ్గింది. బిహార్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలను ఎన్డీయే కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాయపూర్ సిటీ సౌత్ సీటును బీజేపీ కాపాడుకుంది. మధ్యప్రదేశ్‌లో ఒక అసెంబ్లీ సీటు ఉప ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.
రెండు ఎంపీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ కూటమి అభ్యర్థులు ఊహించని విజయాలను సాధించారు.