అమెరికా న్యాయవిభాగం నవంబర్ 20న జారీచేసిన ఒక ప్రకటనలో 57ఏళ్ళ సంజయ్ కౌశిక్ అనే భారతీయుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. నియంత్రిత వైమానిక విడిభాగాలను అక్రమంగా ఎగుమతి చేయడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో కేసు సంజయ్ కౌశిక్ మీద కేసు పెట్టింది. ఎగుమతుల నియంత్రణ సంస్కరణల చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని న్యాయవిభాగం పేర్కొంది.
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో సంజయ్ కౌశిక్ మీద కేసు నమోదయింది. సాధారణ, సైనిక విమానాలు రెండింటికీ ఉపయోగించే నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్‌ను భారత్ ద్వారా రష్యాకు ఎగుమతి చేయడానికి ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు చేసారు. కౌశిక్‌ను ఇప్పటికే, అంటే అక్టోబర్ 17నే ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీలో అరెస్ట్ చేసారు.
2023 మార్చిలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటినుంచే సంజయ్ కౌశిక్ ఈ కుట్రకు తెరతీసారని అమెరికా న్యాయవిభాగం ఆరోపించింది. సంజయ్ తదితరులు అమెరికా నుంచి తప్పుడు పద్ధతుల్లో ఏరోస్పేస్ టెక్నాలజీని చట్టవిరుద్ధంగా పొందారన్నది ప్రధాన ఆరోపణ. సంజయ్ భారత్‌లోని తన కంపెనీకి అవసరమంటూ ఏవియేషన్ కాంపొనెంట్స్ కొన్నారనీ, నిజానికి వాటిని రష్యన్ సంస్థల కోసం తీసుకున్నారని అమెరికా వాదన.
ఓరెగాన్ కేంద్రంగా పనిచేసే ఒక సరఫరాదారు దగ్గర సంజయ్ కౌశిక్ ‘ఆటిట్యూడ్ హెడింగ్ రిఫరెన్స్ సిస్టమ్’ కొనుగోలు చేసారు. నిజానికి అమెరికాలో, రష్యన్ సంస్థలకు విక్రయాలు చేయాలంటే వాణిజ్య విభాగం నుంచి ప్రత్యేకమైన ఎగుమతి లైసెన్స్ తీసుకోవాలి. అలాంటిదేమీ లేకుండానే సంజయ్ కౌశిక్ ఆ సిస్టమ్‌ను కొనుగోలు చేసారని అమెరికా న్యాయవిభాగం వాదన. భారత్‌లోని ఒక సివిల్ హెలికాప్టర్ ఆపరేటర్ కోసమని చెప్పడం ద్వారా కౌశిక్, అతని సహచరులు అమెరికన్ కంపెనీని మోసం చేసారని ఆరోపించారు. చిత్రమేంటంటే ఆ సిస్టమ్ అమెరికా నుంచి బైటకు వెళ్ళకముందే దాన్ని గుర్తించినట్లు అమెరికా చెబుతోంది.
ఈ కేసులో నేరం నిరూపణ అయితే సంజయ్ కౌశిక్‌కు గరిష్ఠంగా 20ఏళ్ళ జైలుశిక్ష, 10లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశముంది.