శవాల అప్పగింత కొలిక్కి వచ్చింది. మణిపుర్‌లో జిరిబామ్ జిల్లాలో అనుమానాస్పదంగా నదిలో శవాలై తేలిన ఆరుగురు మైతేయి తెగకు చెందిన మహిళలు, చిన్నారులు, పోలీసు కాల్పుల్లో చనిపోయిన మరో వ్యక్తి, ఇటీవల చనిపోయిన మరో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకునేది లేదని మైతేయ్ తెగ నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మృతదేహాలను సిల్సర్ మెడికల్ కళాశాల మార్చురీలో భద్రపరిచారు. ఎట్టకేలకు మృతదేహాలను తీసుకునేందుకు వారు అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది.
తమ వారిని చంపిన కుకీలను తీవ్రవాదులుగా ప్రకటించాలని మైతేయ్ తెగ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మైతేయ్ తెగ వారి శవాలు జిరిబామ్ సమీపంలోని నదిలో బయటపడ్డ తరవాత చెలరేగిన హింసను అదుపు చేసేందుకు సైనిక బలగాలు జరిపిన కాల్పుల్లో పది మంది కుకీలు చనిపోయారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన వారిని పోలీసులు గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే మణిపుర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు 198 కంపెనీల బలగాలు పనిచేస్తున్నాయి. తాజా అల్లర్ల తరవాత మరో 90 కంపెనీల బలగాలను తరలించారు.
మణిపుర్ అల్లర్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయడంపై బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా తప్పుపట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మణిపుర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్లే సమస్య తీవ్రమైందని నడ్డా విమర్శించారు. మణిపుర్‌లో త్వరలో శాంతిభద్రతలు అదుపులోకి తెస్తామని నడ్డా చెప్పారు.