బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పై చేయి సాధించింది. ఆతిథ్య జట్టును తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే పరిమితం చేసిన బుమ్రా సేన, రెండో ఇన్నింగ్స్‌లో కుదురుగా ఆడుతోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (90), కేఎల్ రాహుల్ (62) అర్ధ శతకాలు నమోదు చేయడంతో పాటు అలాగే తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. ఎక్కడా తత్తరపాటుకు గురికాకుండా నింపాదిగా ఆడారు.
మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యాన్ని భారత్ ప్రస్తుతం 57 ఓవర్లు ముగిసేసరికి 218 పరుగుల లీడ్‌లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా ఈ స్కోర్ చేసింది.
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకే పెవిలియన్ చేరింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటకీ తెలుగు కుర్రాడు నితీశ్ క్రీజులో నిలదొక్కుకోవడంతో ఆ మాత్రం స్కోర్ అయినా సాధ్యమైంది. కానీ స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్ ను బుమ్రా ఔట్ చేయగా, అరంగేట్ర పేసర్ రానా, సిరాజ్ మిగతా వికెట్లు తీశారు. దీంతో 46 పరుగుల లీడ్‌తో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది.
జైస్వాల్ అత్యధిక సిక్సులు బాది ప్రపంచ ఘనత సాధించాడు. నేటి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. దీంతో క్యాలెండర్ ఈయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టుల్లో నేటి వరకు 34 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉంది.