హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లా ప్రాగ్‌పూర్ బాలాహార్‌లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ విద్యార్ధులు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కారణం, ఒక ప్రొఫెసర్ విద్యార్ధులను నుదుటి మీద తిలకం పెట్టుకోరాదని, జైశ్రీరామ్ అంటూ భజన చేయరాదనీ నిషేధించారు. విద్యార్ధులు ఆ ప్రొఫెసర్ మీద విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యం కుమారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేసారు. ఆమె ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు.
‘జై శ్రీరామ్’ అనేది రాజకీయ నినాదం తప్ప దైవస్మరణ కాదని ఆ ప్రొఫెసర్ వాదించారని, ఆ కారణం చేతనే తమను రామనామం జపించకుండా నిలువరించారనీ విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేసారు. ఆ ప్రొఫెసర్ చర్యలపై క్యాంపస్‌లో ప్రతీఒక్కరూ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆ ప్రొఫెసర్ ప్రవర్తన సరిగ్గా ఉండదని, తమ మధ్య వివక్ష చూపుతారనీ విద్యార్ధులు ఆరోపించారు.
శుక్రవారం చెలరేగిన ఈ వివాదం క్యాంపస్ దాటి బైటకు కూడా చేరింది. జరిగిన సంఘటన గురించి హిందూ సంస్థలకు తెలిసింది. దాంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ తదితర హిందూ సంస్థల ప్రతినిధులు విశ్వవిద్యాలయం ప్రధానద్వారం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ‘జై శ్రీరామ్’ నినాదాలతో పాటు రామభజనలు ఆలపించారు. డైరెక్టర్ సత్యం కుమారితో భేటీ అయి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ వివాదం గురించి ప్రొఫెసర్ సత్యం కుమారి, ‘‘విద్యార్ధుల ఫిర్యాదును స్వీకరించాము. ఆ ఘటనపై క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసాము. ఆ కమిటీ ముందు ఆ ప్రొఫెసర్, విద్యార్ధులు… ఇరుపక్షాలూ తమ వాదనలు వినిపిస్తాయి. ఆ ప్రొఫెసర్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసాము’’ అని చెప్పారు. క్రమశిక్షణా కమిటీ త్వరలోనే నివేదిక సమర్పించనుంది. దాంతో ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందని డైరెక్టర్ సత్యం కుమారి ఆశాభావం వ్యక్తం చేసారు.
ఈ విషయం తెలిసి హిందూ జాగరణ్ మంచ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థల ప్రతినిధులు విశ్వవిద్యాలయానికి వెళ్ళారు, విద్యార్ధుల నిరసనలకు మద్దతు ప్రకటించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.