వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరవాత ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవి రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజుకు పంపించారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు.
జయమంగళ వెంకటరమణ ఎన్నికల ముందు టీడీపీ వీడి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యేల కోటాలో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంలో అప్పటి నుంచి వెంకటరమణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం రాజకీయ చర్చకు దారితీసింది.
జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మంతనాలు సాగించినట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.