సీఎం అభ్యర్థిపై కూటమి తర్జనభర్జనలు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి అగ్రనేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
బీజేపీ అగ్రనేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఫడణవీస్ మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ ఇప్పటికే ప్రకటించారు. ఈనెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి.
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అని సీఎం షిండేను మీడియా ప్రశ్నించగా ఆ విషయాన్నిమహాయుతి కూటమి నిర్ణయిస్తుందన్నారు. గెలిచిన సీట్ల సంఖ్య ఆధారంగా ముఖ్యమంత్రి పదవిని కేటాయించడంపై గతంలో ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా మార్గదర్శకత్వంతో ముందుకు సాగుతామన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కూటమి 215 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంవీఏ కేవలం 60 స్థానాల్లోనే ముందంజలో ఉంది.