బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన 14మందిని శుక్రవారం అరెస్ట్ చేసారు. వారిలో 12మంది త్రిపురలో, ఇద్దరు అస్సాంలో పట్టుబడ్డారు.
త్రిపురలోని ఖోవై జిల్లా తెలియమురాలో గవర్నమెంట్ రైల్వేపోలీస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు శుక్రవారం నాడు 12మంది బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను కస్టడీలోకి తీసుకున్నారు. వారంతా బంగ్లాదేశ్‌లోకి కాక్స్బజార్కు చెందినవారు. దేశ సరిహద్దుల్లోని వేర్వేరు ప్రదేశాల నుంచి భారత్‌లోకి అక్రమంగా అనధికారికంగా చొరబడ్డారు.
వారు పోలీసుల ప్రాథమిక విచారణలో, ఇరుదేశాల సరిహద్దుల్లోని కార్బుక్, శిలాచరీ ప్రాంతాల నుంచి త్రిపురలోని గోమతి జిల్లాలోకి చొరబడినట్లు వెల్లడించారు. తెలియమురా రైల్వేస్టేషన్లో రైలెక్కి అస్సాం వెళ్ళాలన్నది వారి ప్రణాళిక. అస్సాం నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్ళి, అక్కడ ఒక పరిశ్రమలో ఉద్యోగంలో చేరడానికి ఈ చొరబాటుదారులు సిద్ధమయ్యారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టి అక్కడినుంచి తదుపరి విచారణ కోసం పోలీస్ రిమాండ్‌కు తరలించారు.
మరోవైపు, అస్సాంలో గువాహటిలోని పాన్‌బజార్ పోలీసులు గువాహటి రైల్వేస్టేషన్ దగ్గర ఇద్దరు బంగ్లాదేశీ చొరబాటుదారులను అరెస్ట్ చేసారు. అర్మాన్ మాలిక్, సంసితా బేగమ్ ఇద్దరూ బంగ్లాదేశ్ పౌరులే. వారు గువాహటి నుంచి జమ్మూకశ్మీర్‌కు రైలుమార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా శుక్రవారం నాడు పట్టుబడ్డారు. పాన్‌బజార్ పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత రిమాండ్‌కు తరలించారు.