ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై 2022 నవంబరు 5న చందర్లపాడులో జరిగిన రాళ్ల దాడి కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉండగా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో రాత్రి సమయంలో పర్యటిస్తున్నప్పుడు కొందరు దుండగులు కరెంటు తీసివేసి రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో చంద్రబాబునాయుడి చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుసూదనరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై అప్పట్లోకే కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండటంతో కేసులో పురోగతి కనిపించలేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత కేసు విచారణ మొదలైంది. ఈ కేసులో తాజాగా చందర్లపాడుకు చెందిన కనికంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
వైసీపీ కీలక నేతల ఆదేశాల మేరకు స్థానిక కార్యకర్తలు చంద్రబాబుపై దాడికి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాళ్లదాడిలో 40 మంది వరకు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.