ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడతాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచీ రెండు రాష్ట్రాల్లోనూ స్పష్టమైన ఫలితాలు కనిపించాయి. మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్‌లో ఇండీ కూటములు స్పష్టమైన ఆధిక్యం సాధించాయి.
మహారాష్ట్ర శాసనసభలో 288 నియోజకవర్గాలున్నాయి. అక్కడ మెజారిటీ సాధించడానికి 145 సీట్లలో గెలవాలి. వాటిలో 221 స్థానాల్లో ఎన్‌డిఎ (మహాయుతి) కూటమి ఆధిక్యం సాధించింది. ప్రతిపక్ష ఎంవిఎ కూటమి 55 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం సాధించింది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో మహాయుతి కూటమి పక్షాలు సంబరాలు ప్రారంభించాయి. అందులోనూ, బీజేపీ స్పష్టమైన పైచేయి సాధించింది, ఆ పార్టీ 125 స్థానాల్లో దూసుకుపోతోంది. దాదాపు సింపుల్ మెజారిటీకి కావలసిన సీట్లలో సొంతంగా గెలుపు దిశగా సాగుతుండడం విశేషం.
ఝార్ఖండ్ శాసనసభలో 81 స్థానాలున్నాయి. అధికారం సాధించడానికి 41 స్థానాల్లో గెలుపు సాధించాలి. వాటిలో ఇండీ కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్‌డిఎ కూటమి 30 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ అధికార కూటములే మళ్ళీ విజయం దిశగా సాగుతుండడం విశేషం. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో 2 లోక్‌సభ, 46 అసెంబ్లీ స్థానాలకు ఉపయెన్నికలు జరిగాయి. వాటిలో రాహుల్ గాంధీ వదులుకున్న వయనాడ్ లోక్‌సభా స్థానంలో ప్రియాంకా గాంధీ సుమారు 2లక్షల ఆధిక్యంలో విజయం దిశగా సాగుతున్నారు. నాందేడ్ ఎంపీ సీటులో బీజేపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.