ఓ ముఠా హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణకు చెందిన ఓ కీలక నేతను హత్య చేసేందుకు ఓ ముఠా బిహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేసి తరలిస్తుండగా ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 4 తుపాకులు, 6 మ్యాగజైన్లు, 18 బుల్లెట్లు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
తెలంగాణలో ఓ నేతను హత్య చేయడానికి మాజీ జనశక్తి దళ సభ్యుడు వెంకటరెడ్డి కుట్రపన్నాడు. పలువురి సాయం తీసుకున్నాడు. స్నేహితుడి హోటల్‌లో పనిచేస్తోన్న బిహార్ కూలీ సాయంతో తుపాకులు కొనుగోలు చేసి, తరలించే క్రమంలో పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణకు చెందిన ఓ కీలక వ్యక్తిని హత్య చేయడంతోపాటు, ఏపీలో జనశక్తి దళాన్ని మరలా ఏర్పాటు చేసేందుకు మాజీ మావోయిస్టు వెంకటరెడ్డి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు. మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పక్కా సమాచారంతో పోలీసులు కాపుకాచి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బిహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేసి కారులో తీసుకువస్తోన్న నలుగురు సభ్యుల ముఠా వివరాలు నిఘా వర్గాల ద్వారా అందడంతో ఆదిలాబాద్ పోలీసులు కాపు కాచి అరెస్ట్ చేశారు. వారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.