భారత రాజ్యాంగపు ప్రవేశిక నుంచి ‘లౌకిక’, ‘సామ్యవాద’ అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లపై నవంబర్ 25న ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ఇవాళ వెల్లడించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్లను విచారించే సందర్భంలో సామ్యవాద అన్న పదాన్ని మనదేశంలో సంక్షేమరాజ్యం అన్న భావంలో మాత్రమే ఉపయోగిస్తారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అలాగే, లౌకికవాదం అనేది రాజ్యాంగపు మౌలిక నిర్మాణంలో అంతర్భాగమేనని, 42వ రాజ్యాంగ సవరణను కూడా సుప్రీంకోర్టు గతంలో పరిశీలించిందనీ గుర్తు చేసారు.
బిజెపి నాయకుడు సుబ్రమణ్య స్వామి, న్యాయవాదులు బలరాంసింగ్, కరుణేశ్ కుమార్ శుక్లా, అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
1976లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో లౌకికవాద, సామ్యవాద అన్న రెండు పదాలను చొప్పించారు. అవి భారత రాజ్యాంగపు మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించాయని సుబ్రమణ్యస్వామి తన పిటిషన్లో వాదించారు.