వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మరో కుంభకోణంలో చిక్కుకుని ఏపీ పరువును బజారున పడేశాడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అదానీకి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు రూ.1750 కోట్లు లంచం తీసుకున్నాడంటూ అమెరికా మీడియాలో వచ్చిన కథనాలు దేశం పరువు తీశాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సోలార్ ప్రాజెక్టులోనే రూ.1750 కోట్ల లంచం తీసుకుని ఉంటే, అదానీకి ఏపీ మొత్తం కట్టబెట్టిన జగన్ మరెన్ని కోట్లు లంచం తీసుకున్నాడోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
పొరుగు రాష్ట్రానికి యూనిట్ సౌర విద్యుత్ రూ.1.99పైసలకు సరఫరా చేసిన అదానీ ఏపీలో యూనిట్ రూ.2.49పైసలకు ఎలా పెంచారని..షర్మిల ప్రశ్నించారు. పెరిగిన మొత్తం జగన్‌రెడ్డికి లంచాలు ఇవ్వడానికి కాదా? అని ఆమె వాపోయారు.జగన్ రూ.1750 కోట్ల అవినీతికి పాల్పడటం ద్వారా ఏపీ ప్రజలకు రూ.17 వేల కోట్ల భారం పడిందని గుర్తుచేశారు. ఏపీ జన్ కో, ట్రాన్స్ కోలను జగన్ లక్షా 37 వేల కోట్ల అప్పుల్లో ముంచేసి పోయాడని షర్మిల ఎండగట్టారు. గంగవరం ఓడరేవులోని పది శాతం రాష్ట్ర వాటాను అదానీకి అతి తక్కువ ధరకు అమ్మేసి జగన్ వేల కోట్ల అవినీతి పాల్పడలేదా అని ఆమె ప్రశ్నించారు.
దేశంలో నిఘా సంస్థలు నిద్రపోతున్నాయని, అదానీ, జగన్ అవినీతిపై అమెరికా మీడియాలో కథనాలు వచ్చే వరకు ఎవరికీ ఈ విషయం తెలియకపోవడం దారుణమన్నారు. సీబీఐ, సెబీ, ఆదాయపన్ను, ఈడీ అధికారులు నిద్రపోతున్నారని షర్మిల మండిపడ్డారు.
నటుడు ప్రభాస్ ఎవరో తనకు తెలియదని, అతనితో తనకు సంబంధం ఉందని నటుడు బాలకృష్ణ ఇంటి ఐపీ అడ్రస్ నుంచి పోస్టులు వచ్చాయని తాను పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పుడు జగన్ రెడ్డి దర్యాప్తు చేయించకుండా ఏం చేశాడని షర్మిల ప్రశ్నించింది. ఇప్పటికీ ప్రభాస్ ఎవరో తనకు తెలియదని ఆమె అన్నారు. జగన్ రెడ్డి తీవ్ర అవినీతిలో మునిగిపోయాడని షర్మిల విమర్శలు గుప్పించారు.