భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. అయితే ఓపెనర్లు సహా టాప్ ఆర్డర్ ఆటగాళ్ళు నిరాశపరిచారు. బుమ్రా సేన 59 పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది.
భారత్, మూడో ఓవర్ తొలి బంతికి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టపోయి ఐదు పరుగులు చేశారు. 9 ఓవర్లకు రాహుల్, పడిక్కల్ కలిసి భారత్ స్కోర్ 14 పరుగులకు చేరింది.
దేవదత్ కూడా 23 బంతులు ఆడి హెజిల్ వుడ్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. కానీ కోహ్లీ ఐదు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ మూడో వికెట్ నష్టపోయింది. 17 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కాసేపు క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారిని స్టార్క్ విడదీశాడు. నాలుగో వికెట్ రూపంలో భారత్, రాహుల్ (26) ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురైల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) కూడా నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హెజల్ వుడ్, మార్ష్ తలా రెండు వికెట్లు తీశారు.
భారత్ తుది జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డితో పాటు హర్షిత్ రాణాకు చోటుదక్కింది. అరంగేట్ర ప్లేయర్లకు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా క్యాప్స్ అందజేసి అభినందించారు. సీనియర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నారు.
భారత్ తుదిజట్టు…
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు…
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జాస్ హేజిల్‌వుడ్.
ఆసీస్ జట్టులో నాథన్ మెక్‌స్వీనీ అరంగేట్రం చేశాడు . ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయనున్నాడు.