తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపినట్లు చేసిన అభియోగాలను తోసిపుచ్చింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరించింది. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది.
సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టు కోసం అదానీ గ్రూపు రూ.2,100 కోట్లు భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందని, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. గౌతమ్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.
అమెరికా ప్రాసిక్యూటర్ చేసినవి నేరారోపణలు మాత్రమేనని అదానీ గ్రూపు పేర్కొంది. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. పాలనా వ్యవహారాలుు, పారదర్శకత విషయంలో అదానీ గ్రూపు ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందన్నారు. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.