రష్యా ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తరవాత ఎన్నడూ లేని విధంగా రష్యా ఖండాతర క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. అణుబాంబుల వాడకానికి సంబంధించిన నిబంధనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ సవరించిన 24 గంటల్లోనే మధ్యస్థాయి ఖండాతర క్షిపణితో దాడులు చేశారు. ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలను దెబ్బతీసేందుకే దీనిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. రష్యాలోని ఆస్ట్రాఖాన్ నుంచి ఈ ఖండాతర క్షిపణిని ప్రయోగించారు.
ఖండాంతర క్షిపణులను సహజంగా అణుబాంబులతో దాడి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు.అణుక్షిపణులు ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ అనుమతించిన నేపథ్యంలో రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది.
1000 రోజుల యుద్ధంలో రష్యా భారీగా సైన్యాన్ని కోల్పోయింది. ఉత్తరకొరియా నుంచి సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఉక్రెయిన్ క్షిపణి దాడులకు దిగితే అణుబాంబులతో దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ క్షిపణి దాడులు తీవ్రతరం చేస్తే రష్యా చివరి అస్త్రం అణుబాంబులను బయటకు తీసే అవకాశం లేకపోలేదు.