ఇదే ధోరణి కొనసాగితే భారత్ పై సానుకూల, ప్రతికూల ప్రభావాలు
దేశంలో సంతానోత్పత్తి రేటు క్షీణత కలవరానికి గురిచేస్తోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందిన భారత్ లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ 2024 నాటికి దేశ జనాభా 145.56 కోట్లుగా ఉండగా, సంతానోత్పత్తి రేటులో చెప్పుకోదగిన క్షీణతను ఎదుర్కొంటోంది. ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తులో దేశానికి సానుకూల, ప్రతికూల పరిణామాలను తెచ్చిపెట్టనుందని నిపుణులు విశ్లేషణలు చేస్తున్నారు.
1950లో దాదాపు 250 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ప్రస్తుతం 800 కోట్లకు చేరింది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం 1950లో ఒక మహిళకు 6.2 మంది పిల్లలు ఉంటే భారతదేశంలో ఇప్పుడు సంతానోత్పత్తి రేటు రెండు శాతానికన్నా తక్కువగా ఉంది. ఇదే ధోరణి భవిష్యత్లో కొనసాగితే భారత్లో సంతానోత్పత్తి రేటు 2050 నాటికి 1.3 శాతానికి పడిపోతుంది.
2021లో భారత్లో సుమారుగా రెండు కోట్ల మంది పిల్లలు జన్మించారు. 2050 నాటికి ఈ సంఖ్య కేవలం 1.3 కోట్లకు తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి . తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రాబోయే కాలంలో సంతానోత్పత్తి రేటులో క్షీణతను ఎదుర్కొనున్నాయి.
ఆలస్యంగా వివాహాలు జరగడం, ఉన్నత విద్యావకాశాలు పెరగడం, కుటుంబ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం మొదలైన కారణాలతో సంతానోత్పత్తి రేటు తగ్గింది. ముఖ్యంగా వనరుల నిర్వహణ, జీవన నాణ్యత కోణంలో సంతానోత్పత్తి రేటు క్షీణత సానుకూల ప్రభావం చూపనుంది. ఆహారం, నీరు, ఇంధన శక్తి తదితర వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు తక్కువ పిల్లలను కలిగి ఉన్న మహిళలు సగటున ఎక్కువ కాలం జీవిస్తారని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
సంతానోత్పత్తి రేటు పడిపోతే సమాజంలో యువత నిష్పత్తి తగ్గి వృద్ధుల జనాభా పెరుగుతుంది. ఫలితంగా కార్మిక మార్కెట్లో అసమతుల్యత, సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడికి దారి తీస్తుంది.
భారతదేశంలో 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభాలో తగ్గుదల నమోదు అవుతోంది. 2001లో 36.4 కోట్ల నుంి 2024 నాటికి 34 కోట్లకు చేరుకుంది. 60 అంతకంటే అధిక వయసు కలిగినవారి సంఖ్య 1991లో 6.1 కోట్ల నుంచి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇలాంటి సమయంలో సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లాంటి లక్ష్య వ్యూహాలతో ప్రభుత్వాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.