పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ అన్నారు. మహిళలు,యువత,రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యం అన్నారు. 2017 లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇప్పటికే 4 కోట్ల ఇళ్లు నిర్మించారని తెలిపారు. ఇందులో మూడు కోట్ల మంది మహిళలే ఇంటి యజమానురాలుగా ఉండటం మోదీ సంకల్పానికి నిదర్శనం అన్నారు.
మహిళా సాధికారితకు ప్రధాని మోదీ పెద్దపీఠ వేశారని కొనియాడారు. వచ్చే ఐదేళ్ళలో 5.36 లక్షల కోట్లతో మరో మూడు లక్షల ఇళ్లు నిర్మించేలా కేంద్రం ప్రణాళికలు సిద్దం చేసిందని యామినీ శర్మ అన్నారు. ఏపీలో పట్టణాల్లో 21.37 లక్షల మందికి ఇళ్లను కేటాయించగా, గ్రామీణ ప్రాంతాల్లో 2.30లక్షల ఇళ్ళను నిర్మాణం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం 32వేల కోట్లు కేటాయించగా, పూర్తైన ఇళ్లకు 23వేల 800కోట్లు విడుదల చేసిందని లెక్కలతో వివరించారు.
గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలన అవినీతి, నియంతృత్వం, ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని దుయ్యబట్టారు. పేదల నివాసాల నిర్మాణం కోసం కేంద్రం కేటాయించిన నిధులు కూడా దారి మళ్ళించారని విమర్శించారు. కేంద్ర పథకాలకు జగన్ తన స్టిక్కర్ వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం అందిస్తుంటే వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానికి కూడా కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీ అభివృద్ది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్న యామినీ శర్మ, వచ్చే ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు చూసి అందరూ ఆశ్చర్యపోవడం ఖాయమన్నారు.