ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటును కాంపిటెంట్ అథారిటీ ముందుంచాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత ఈ విషయం హైకోర్టు రిజిష్ట్రారుకు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల వచ్చని హైకోర్టు సూచించింది.
కర్నూలులో హైకోర్ట్ బెంచ్ రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష. తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రం విడిపోయిన తరవాత కొంత కాలం గుంటూరులో హైకోర్టు బెంచ్ కొనసాగింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రజాగళం యాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు చర్యలు ప్రారంభించారు. రాయలసీమలో 1.49 లక్షల మంది జనాభా ఉన్నారని, హైకోర్టులో మూడో వంతు కేసులు రాయలసీమ నుంచి వస్తున్నాయని, నేరుగా ఆ ప్రాంతం నుంచి రైలు రవాణా సదుపాయాలు లేకపోవడం ఇబ్బందిగా మారిందని ప్రభుత్వం హైకోర్టు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లింది.
దేశంలో పలు రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. మహారాష్ట్ర నాగపూర్‌లో, మధ్యప్రదేశ్ గ్వాలియర్, ఇండోర్‌లో, పశ్చిమబెంగాల్ జల్పాయ్‌గురిలో, తమిళనాడు మధురైలో హైకోర్టు బెంచీలను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.