అమెరికా న్యూయార్క్‌లోని జిల్లా కోర్టులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మీద కేసు నమోదయింది. లంచం ఆశ చూపడం, ప్రజలను మోసగించడం అనే ఆరోపణలపై కేసు నమోదయింది.
న్యూయార్క్ ఈస్టరన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఈ విధంగా వెల్లడించింది. ‘‘గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ తదితరులపై నేరారోపణ నమోదయింది. ఒక మల్టీ బిలియన్ డాలర్ పథకంలో అమెరికన్ పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంస్థల నుంచి నిధులు పొందడానికి తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే సమాచారం వెల్లడించి మోసం చేసినట్లు నేరారోపణ జరిగింది.’’
న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదైన పునరుత్పాదక ఇంధనశక్తి సంస్థ మాజీ అధికారులు రంజిత్ గుప్తా, రూపేష్ అగర్వాల్… కెనడాకు చెందిన సంస్థాగత మదుపరి సంస్థ మాజీ ఉద్యోగులు సిరిల్ కబానెస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రాలను కూడా ఆ కుంభకోణంలో నిందితులుగా చేర్చారు. నిధుల సేకరణ కోసం అమెరికన్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్‌ను కుట్రపూరితంగా ఉల్లంఘించిన నేరానికి వారందరిపైనా కేసు నమోదయింది.
‘‘లక్షల కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులు పొందడం కోసం నిందితులు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడానికి విస్తృతమైన పథకం రచించారు. అమెరికా, ఇతర అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి మూలధనాన్ని సేకరించడం కోసం గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ తమ లంచాల పథకం గురించి అబద్ధాలు ఆడారు’’ అని అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ ఆరోపించారు. నిందితులు అంతర్జాతీయ ఆర్థిక విపణుల సమగ్రతను బలహీనపరిచారని, అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన పెట్టుబడిదారులను మోసం చేసారనీ బ్రియాన్ పీస్ ఆరోపించారు.
‘‘వారు తమ వ్యాపారాలకు లబ్ధి చేకూరడం కోసం మంచి కాంట్రాక్టులకు ఆర్థిక సాయం చేసేందుకు భారత ప్రభుత్వంలోని అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదానీ, మిగతా నిందితులు లంచాల గురించి, అవినీతి గురించి తప్పుడు ప్రకటనలు చేసి మూలధనం సేకరించడం ద్వారా పెట్టుబడిదారులను మోసగించారు. ప్రభుత్వ దర్యాప్తును అడ్డుకోవడం ద్వారా ఆ లంచాల కుట్రను దాచివేయడానికి మిగతా నిందితులు ప్రయత్నించారు’’ అని ఎఫ్బిఐ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జ్ జేమ్స్ డెనే ప్రకటించారు.
అమెరికాకు చెందిన ఎఫ్బిఐ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, ఆ దేశపు న్యాయ శాఖల దర్యాప్తులను అడ్డుకోడానికి ఆ వ్యాపారవేత్తలు ప్రయత్నించారని ఆ నేరారోపణలో పేర్కొన్నారు.
నేరారోపణలో పేర్కొన్న వివరాలు ప్రస్తుతానికి ఆరోపణలు మాత్రమేనని, వాటిని నిరూపించేవరకూ నిందితులను అమాయకులుగానే భావించాలనీ, నేరం నిరూపణ అయితేనే వారు దోషులు అవుతారనీ అటార్నీ కార్యాలయం వెల్లడించింది.
అమెరికా ప్రభుత్వం తరఫున ఈ కేసును అటార్నీ కార్యాలయంలోని బిజినెస్ అండ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ సెక్షన్, అలాగే క్రిమినల్ డివిజన్లోని ఫ్రాడ్ సెక్షన్ వాదిస్తున్నాయి.