నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా 13,822 ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 215 మాత్రమే ఉన్నాయని, అది పూర్తిగా గతప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జనరిక్ మందులపై గత ప్రభుత్వం దృష్టి సారించలేదని, ప్రజల ఆరోగ్యం పట్ల వారికి చిత్తశుద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనరిక్ మందులపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు.
రాష్ట్రంలో ప్రత్యేకంగా 325 జనరిక్ మందుల దుకాణాలుండగా అందులో ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు 215, అన్న సంజీవని మొదలైనవి 73, ఎన్‌జిఓలు, ఇతర సంస్థలు నడుపుతున్నవి 37 ఉన్నాయన్నారు. ప్రస్తుతం 34,761 చిల్లర మందుల దుకాణాల్లో బ్రాండెడ్ మందులతో పాటు జనరిక్ మందులను కూడా విక్రయిస్తున్నారన్నారు. జనరిక్ మందుల గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు జనరిక్ మందులు రాయడంలేదని వివరించారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలను ప్రారంభించేలా యువతను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వాటి ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో వినియోగానికి 560 రకాల అనుమతి పొందిన అత్యవసర మందుల జాబితా ప్రకారం జనరిక్ మందులను సేకరించి, సరఫరా చేస్తున్నామన్నారు. జనరిక్ మందుల దుకాణాలకు 15 రోజుల్లో లైసెన్స్‌లు మంజూరు చేస్తామన్నారు. జనరిక్ మందుల నాణ్యత గురించి అవగాహన కల్పించడానికి పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నామన్నారు. జనౌషధి దుకాణాలు ప్రారంభించేందుకు నిరుద్యోగ ఫార్మసిస్టులను ప్రోత్సహిస్తామన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ మందులను మాత్రమే రాస్తారని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బ్రాండెడ్ మందులు కొనాలని ఆదేశించామని మంత్రి సభకు చెప్పారు.
రాష్ట్రంలోని 17 టీచింగ్ ఆసుపత్రులతో పాటు జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా జనరిక్ దుకాణాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. జనరిక్ మందుల గురించి ప్రజల్లో అపోహలున్నాయని, అయితే బ్రాండెడ్, జనరిక్ మందుల మధ్య ఏ తేడా లేదని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. జనరిక్ మందుల్లోని పదార్థాలు, పనితీరు బ్రాండెడ్ మందులతో సమానంగానే ఉంటాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. దేశంలో రూ.2.10 లక్షల కోట్ల విలువైన జనరిక్ మందులు విక్రయిస్తుంటే, రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయన్నారు. అందులో 7శాతమే జనరిక్ మందుల విక్రయాలు ఉన్నాయన్నారు. బ్రాండెడ్ మందుల కంటె జనరిక్ మందుల ధరలు 30 నుండి 70 శాతం తక్కువ ధర ఉంటాయన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉందన్నారు.
జనరిక్ మందుల దుకాణాల్లో కచ్చితంగా జనరిక్ మందుల్ని మాత్రమే అమ్మాలనీ, బ్రాండెడ్ మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ మందులే ఇస్తారని, ఎపిఎంఎస్ఐడిసి కూడా జనరిక్ మందులనే కొనుగోలు చేస్తుందని, అత్యవసర పరిస్థితుల్లోనే బ్రాండెడ్ మందులు ఉపయోగిస్తారన్నారు.