తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను కేసులతో వేధించడం గురించి ఆయన మాట్లాడారు.
ఆ సందర్భంగా జగన్ తెలుగుదేశం మీద తీవ్ర విమర్శలు చేసారు. ‘‘ఐ-టిడిపి పేరుతో నా కుటుంబం మీద దుష్ప్రచారం చేసారు. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించారు. నా గురించి, నా తల్లి గురించి, నా చెల్లి గురించి నీచంగా పోస్టులు పెట్టారు. షర్మిల మీద బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెట్టారు. చంద్రబాబూ, నీక్కూడా కుటుంబం ఉంది. రాజకీయంగా ఎదిగిన తర్వాత మీ తల్లిదండ్రులను ఇంటికి పిలిచి కనీసం భోజనం పెట్టావా? వారు చనిపోతే తలకొరివి పెట్టావా?’’ అని జగన్ ప్రశ్నించారు.
‘‘ఉదయ్ భూషణ్ అనే కార్యకర్తతో నా కుటుంబాన్ని తిట్టించారు. ఫిబ్రవరిలో అతన్ని అరెస్ట్ చేసారు. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించి తప్పుడు పోస్టులు పెట్టించారు. సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. సెన్సార్ సర్టిఫికేషన్ తర్వాతే సినిమాలు విడుదలయ్యాయి కదా. యెల్లో బ్యాచ్ ఎలాంటి సినిమాలైనా తీయవచ్చు, ఇంకెవరూ వారిని విమర్శిస్తూ సినిమాలు తీయకూడదా?’’ అని ప్రశ్నించారు.
‘‘దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద పలు కేసులు నమోదు చేసారు. ఆయన 70 రోజులుగా జైల్లోనే మగ్గిపోతున్నారు. దాన్ని ప్రశ్నించిన దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీదా కేసులు పెట్టారు. అక్రమంగా అరెస్టులు చేసి, వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. అలాంటి హింసలను వీడియోలు చిత్రీకరించి పైవారికి పంపిస్తున్నారు’’ అని జగన్ మండిపడ్డారు.