‘కరేబియన్ కమ్యూనిటీ –కరికామ్’లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన చారిత్రక ఘట్టమని బార్బడోస్ ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లే అన్నారు. కరేబియన్ ద్వీప దేశాలతో భారత్ సదస్సులో పాల్గొనడాన్ని తమ దేశాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆమె చెప్పారు. ప్రధాని స్థాయి ప్రభుత్వాధినేతల పర్యటనలు ఇరుదేశాల మధ్యా సంబంధాల బలోపేతానికి నిదర్శనమని మియా అభిప్రాయపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ గయానా దేశానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, గ్రెనడా ప్రధానమంత్రి డికన్ మిషెల్, బార్బడోస్ ప్రధాని మియా మోట్లే, తదితరులు ఆహ్వానం పలికారు.
కరేబియన్ కమ్యూనిటీ అనేది 21 దేశాల సమూహం. ఆ కరేబియన్ దేశాల్లో 1.60కోట్ల జనాభా ఉంటారు. వారిలో 60శాతానికి పైగా జనాభా 30ఏళ్ళలోపు వారే. వారిలో అత్యధికులు కరేబియన్ ద్వీపాల ఆదివాసీలే ఉంటారు. ఇంకా ఆఫ్రికా, భారత్, ఐరోపా, చైనా, పోర్చుగల్, జపాన్ తదితర దేశాల నుంచి వెళ్ళినవారు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నారు.
ఒక్క బార్బడోస్‌లోనే సుమారు 3వేల మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. దాదాపు వారందరికీ అక్కడ స్థానిక జాతీయత వచ్చేసింది. భారత్, బార్బడోస్ దేశాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఐక్యరాజ్యసమితి, కామన్వెల్త్, తదితర అంతర్జాతీయ వేదికలపై బార్బడోస్, భారతదేశానికి మిత్రదేశంగా వ్యవహరిస్తూ ఉంటుంది.
గత 56 సంవత్సరాల్లో కరేబియన్ ద్వీపదేశాలను సందర్శించిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కావడం విశేషం. ఆ సందర్భంగా మోదీ గయానా పార్లమెంటులో ప్రసంగిస్తారు. మోదీ గౌరవార్థం ఆయనకు గయానా రాజధాని జార్జిటౌన్ తాళాలను బహూకరించారు.