కర్ణాటక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తానంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల మీద అదనపు భారాన్ని మోపింది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవల రుసుములను పెంచింది.
బెంగళూరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు ఆస్పత్రులు ఉన్నాయి. విక్టోరియా హాస్పిటల్, వాణీ విలాస హాస్పిటల్, మింటో హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహా పలు ట్రామాకేర్ సెంటర్లు ఉన్నాయి. అవి బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (బిఎంసిఆర్ఐ) పరిధిలో పనిచేస్తున్నాయి. ఆ ఆస్పత్రుల్లో చికిత్సలు, సర్జరీలు, రక్త పరీక్షలు, స్కానింగ్లు, ఇతర వైద్యసేవల ధరలను పెంచుతూ ఇటీవల బిఎంసిఆర్ఐ ఉత్తర్వులు జారీ చేసింది.
దానిలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, వివిధ సేవలకు సంబంధించిన రుసుములను 50 నుంచి 100శాతం పెంచారు. బడుగు బలహీన వర్గాల ప్రజల వైద్య అవసరాలు తీర్చే ఆస్పత్రుల్లో ఈ ధరల పెంపుదల తర్వాత ఒక మోస్తరు ఆదాయం ఉన్నవాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి.
ఓపీడీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10 నుంచి రూ.20కి పెంచారు. ఇన్పేషెంట్ అడ్మిషన్ ఫీజు రూ.25 నుంచి రూ.50 చేసారు. రక్తపరీక్ష రుసుము రూ.70 నుంచి రూ.120కి పెంచారు. వార్డు ఖర్చులు రూ.25 నుంచి రూ.50 చేసారు. చెత్త నిర్వహణ రుసుము రూ.10 నుంచి రూ.50కి పెంచారు.
చూడడానికి ఈ పెంపుదల తక్కువగానే కనిపించవచ్చు, కానీ పేద ప్రజలపై పడే భారం ఎక్కువే. మహానగరంలో జీవన వ్యయానికి తోడు ఆరోగ్య ఖర్చులు తడిసి మోపెడైనప్పుడు, వైద్యసేవల ధరలు కూడా పెంచడం బడుగు బలహీన వర్గాల మీద అదనపు భారమే.
ఈ కొత్త ధరలనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. వైద్యకళాశాలల పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో వైద్యచికిత్స ధరలను కూడా సవరించే యోచనలో ఉంది. ధరల పెంపు తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స ఖర్చులు 15 నుంచి 20శాతం వరకూ పెరుగుతాయని అంచనా.
ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ధ్రువీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడానికి ఈ ధరలు పెంచలేదని ఆయన చెప్పుకొచ్చారు. వైద్య చికిత్సల ధరవరలను ప్రతీ రెండుమూడేళ్ళకు ఒకసారి సవరిస్తుంటారని, అందులో భాగంగానే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయనీ ఆయన చెప్పారు.