అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరు ఇకపై శ్రీభూమిగా మారనుంది. ఆ మేరకు అస్సాం మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.
దిస్పూర్లో పాత్రికేయులతో మాట్లాడుతూ హిమంత ‘‘అస్సాంలోని వేర్వేరు జిల్లాల్లో పలు గ్రామీణ ప్రాంతాల పేర్లను మార్చాం. ఆ క్రమంలోనే కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమి జిల్లా అని మార్చాం. ఆ కొత్త పేరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది’’ అని వెల్లడించారు.
చారిత్రక ప్రాధాన్యం లేని ప్రదేశాల పేర్లను క్రమంగా మారుస్తామని హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ‘‘ఉదాహరణకు ‘కాలాపహాడ్’ అనే పేరుకు ఎలాంటి చారిత్రక ప్రాధాన్యమూ లేదు. అలాగే కరీంగంజ్ అనేది కూడా అర్ధరహితమైన పేరు. అస్సామీ, బెంగాలీ నిఘంటువుల్లో కరీంగంజ్కు ఏ నిర్వచనమూ లేదు. శ్రీభూమి అనే పేరుకు ఒక గొప్ప అర్ధం ఉంది కాబట్టి ఆ పేరు పెట్టాం. ఇలా పేర్లు మార్చే ప్రక్రియ క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటుంది’’ అని హిమంత వివరించారు.
ఇదే అంశంపై ఎక్స్ మాధ్యమంలో ట్వీట్ చేస్తూ, ‘‘ఈ చర్య ద్వారా మేం రవీంద్రనాథ్ టాగోర్ను గౌరవించుకున్నాం. అవిభక్త భారతదేశంలో ఈ ప్రదేశానికి శ్రీభూమి, లక్ష్మీదేవి నివసించే ప్రదేశం అని టాగోరే పేరు పెట్టారు. ఇప్పుడు కరీంగంజ్ జిల్లాగా ఉన్న ప్రాంతాన్ని టాగోర్ దాదాపు వందేళ్ళ క్రితమే శ్రీభూమి అని పిలిచారు. జిల్లాకు ఆ పేరే పెట్టాలన్నది చిరకాలంగా స్థానిక ప్రజల ఆకాంక్ష. వారి కోరికను అస్సాం మంత్రివర్గం నెరవేర్చింది’’ అని హిమంత బిశ్వ శర్మ వివరించారు.