మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ ఇవాళ జరుగుతోంది. పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపిల మహాయుతి కూటమి అధికార పక్షంగా బరిలో ఉంది. రెండోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్ పార్టీల మహా వికాస్ అఘాడీ కూటమి పోరాడుతోంది. అధికార మహాయుతి కూటమి ప్రధానంగా సంక్షేమ పథకాల హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ‘లాడ్లీ బహెన్ స్కీమ్’ ప్రజలను ఆకట్టుకుంటుందని భావిస్తోంది. ప్రతిపక్ష కూటమి మాత్రం లోక్సభ ఎన్నికల్లోలా ఇప్పుడు కూడా ప్రజలు అధికార పక్షాన్ని అడ్డుకుంటారని అంచనా వేస్తోంది. శివసేన, ఎన్సిపిలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రజలు హర్షించలేదని, అందుకే తమ ఎంవీఏ కూటమినే ఆదరిస్తారనీ భావిస్తోంది.
ఝార్ఖండ్లో ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఈ దఫా పోలింగ్లో 38 నియోజకవర్గాల ప్రజలు తమ అభిప్రాయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. జేఎంఎం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్, ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బావురీ తదితరులు ఈ దశ ఎన్నికల బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా జరిగింది, ఫలితాలూ ఇరుపక్షాలకూ దాదాపు ఒక్కలాగే వచ్చాయి. జేఎంఎం 30 సీట్లు, బీజేపీ 25 సీట్లు సాధించాయి. అయితే మిత్రపక్షాలు కాంగ్రెస్-ఆర్జెడిలతో కలుపుకుని 47 సీట్లు సాధించిన జేఎంఎం కూటమి అధికారాన్ని అందుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాలను కోల్పోయింది. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకుని మళ్ళీ పగ్గాలు అందుకోడానికి ప్రయత్నిస్తోంది. తమ ఆధిక్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని జేఎంఎం కూటమి భావిస్తోంది.
ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటలకు, అంటే మొదటి రెండు గంటల్లో మహారాష్ట్రలో 6.61శాతం పోలింగ్ నమోదయింది. ఝార్ఖండ్లో 12.71శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది.