పోలవరం ప్రాజెక్టు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టును 2027కి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సభ్యులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పలు విషయాలు వివరించారు. ఏపీకి అమరావతి, పోలవరం రెండు కళ్లు అని పేర్కొన్న చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు ఎత్తు కచ్చితంగా 45.72 మీటర్లు ఉంటుందని తేల్చి చెప్పారు.
గత ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రికి టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలియదని దెప్పిపొడిచిన చంద్రబాబు, పోలవరం నిర్మాణం గురించి అడిగితే పర్సెంటా, హాఫ్ పర్సెంటా అని హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 3.08 శాతం పనులే చేసిందని పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు కోసం రూ.16,493 కోట్లు ఖర్చు చేస్తే, గత సర్కారు మాత్రం రూ.4,099 కోట్లే వెచ్చించినట్లు తెలిపారు.
జనవరి లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించి 2026 మార్చి లోపు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ప్రాజెక్టు 2027 లోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.