దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పొగ కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్సు 500 దాటిపోయింది. అత్యంత ప్రమాదకర స్థాయి రికార్డైంది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం జూమ్ కాన్ఫరెన్సు ద్వారా కేసులు విచారించారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం చూపుతున్న విధంగా నగరంలో వాయుకాలుష్యం 500 కాదని, 1600లుగా ఉందని అంతర్జాతీయ వాయు కాలుష్య యాప్ ఐక్యూ ఎయిర్ నిర్ధారించింది.
కాలుష్యం కొలవడంలో పలు దేశాలు వివిధ ప్రమాణాలు పాటిస్తున్నాయి.అందుకే ఈ తేడాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పీఎం 2.5 నాణ్యత 60 కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం అది 10గా ఉంది.
కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఏక్యూఐ 50 కన్నా తక్కువగా ఉంటే నాణ్యమైన గాలిగా పరిగణిస్తారు. ఇక 51 నుంచి 100 పరవాలేదు, 101 నుంచి 200 మధ్యస్థం, 201 నుంచి 300 ఆరోగ్యానికి ప్రమాదకరం, 301 నుంచి 400 గాలి నాణ్యత చాలా తక్కువ, 450 దాటితే చాలా ప్రమాదం, 450 నుంచి 500 దాటితే అత్యంత ప్రమాదకరంగా వర్గీకరించింది.
అంతర్జాతీయ సంస్థలు గాలి నాణ్యతను పరీక్షించేందుకు ఎలాంటి పద్దతులు అవలంబిస్తున్నాయి. ఢిల్లీలో ఏ ప్రాంతాల్లో వారు పరికరాలను అమర్చారు అనే దానిపై స్పష్టత లేదు. అందుకే ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించే డేటాను అందరూ అనుసరిస్తున్నారు. ఈ సంస్థ నగరంలో 40 ప్రాంతాల్లో వాయు నాణ్యత గుర్తించే పరికరాలు అమర్చింది. ఎప్పటికప్పుడు డేటాను రికార్డు చేస్తోంది.