ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. నాలుగు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాను బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయించేందుకు కేంద్ర ఆర్థికశాఖ రంగం సిద్ధం చేస్తోందనేది రాయిటర్స్ కథనం సారాంశం.
స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ నిబంధనలకు అనుగుణంగా వాటాల ఉపసంహరణ జరగనుందని పేర్కొంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ , యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ల్లో వాటాల ఉపసంహరణకు కేబినెట్ లో ఆర్థిక శాఖ ఆమోదం పొందనుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93 శాతానికి పైగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 96.4 శాతం, యుకో బ్యాంకులో 95.4, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 98.3 శాతం వాటాలు కేంద్రప్రభుత్వ కలిగి ఉంది.
ఓపెన్ మార్కెట్లో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా వాటాల విక్రయం పరిశీలనలో ఉందనేది అధికార వర్గాల సమాచారం. వాటాల విక్రయం వార్తల షికార్ల నేపథ్యంలో బ్యాంకుల షేర్లు మూడు నుంచి నాలుగు శాతం మధ్య పెరిగాయి.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) నిబంధన ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో 25 శాతం పబ్లిక్ షేర్ తప్పనిసరి. గా ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిబంధన నుంచి 2026 ఆగస్టు వరకూ మినహాయింపు ఉంది.
ఈ విషయంపై ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.