భారత కోస్ట్ గార్డ్ షిప్, అరేబియా సముద్రంలో భారీ ఛేజింగ్ చేసింది. భారత మత్స్యకారులను బంధించి తీసుకెళుతున్న పాకిస్తాన్ షిప్ ను భారత కోస్ట్ గార్డ్ షిప్ వెంటాడి, వారిని రక్షించింది. అరేబియా సముద్రంలో దాదాపు రెండు గంటల పాటు ఇరుదేశాల మధ్య ఛేజింగ్ జరిగింది. ఎట్టకేలకు భారత్ మత్స్యకారులను పాక్ అధికారుల చెర నుంచి విడిపించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపిన వివరాల మేరకు… అరేబియా సముద్రంలోని నో ఫిషింగ్ జోన్ పరిధిలో భారత మత్స్యకారుల బోటుపై పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక దాడిచేసింది. బోటును సముద్రంలో ముంచేసి, ఏడుగురు మత్స్యకారులను బంధించి తమ దేశం తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది.
పాక్ నౌక దాడిని మత్స్యకారులు భారత కోస్ట్ గార్డ్ కు తెలిపారు. వెంటనే స్పందించిన అధికారులు కోస్ట్ గార్డ్ నౌకను మత్స్యకారుల రెస్క్యూ బాధ్యత అప్పగించారు. వెంటనే రంగంలోకి కోస్టుగార్డులు, పాకిస్తాన్ నౌకను వెంటాడి అడ్డగించారు. పాక్ అధికారుల చెరనుంచి ఏడుగురు భారత మత్స్యకారులను విడిపించారు. అనంతరం వారిని సురక్షితంగా తీరానికి చేర్చారు.