కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా నుంచి భారత్ ప్రయాణించే వారికి అదనపు భద్రతా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కెనడా రవాణా మంత్రి ప్రకటించారు. నవంబరు 1 నుంచి 19 తేదీ వరకు భారత విమానాల్లో ప్రయాణాలు చేయవద్దని ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ అదనపు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. భారత్ వెళ్లే ప్రయాణీకులు 4 గంటల ముందుగా విమానాశ్రయాలకు చేరుకోవాలని కెనడా రవాణా మంత్రి అనితా ఆనంద్ సూచించారు.
సిఖ్స్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించారు. హత్యకు గురైన నిజ్జర్ సహా, పన్నూ కూడా వ్యవస్థాపకుల్లో ఉన్నారు. 2019లో ఈ సంస్థను కేంద్రం నిషేధించింది. అప్పటి నుంచి పన్నూ కెనడా, అమెరికాల్లో ఉంటున్నాడు. ఇటీవల పన్నూ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ విమానాల్లో తనిఖీలు పెంచారు. ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఉగ్రకార్యక్రమాలకు తెరలేపే ప్రమాదముందని పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు.
తాజాగా కెనడాలో చోటు చేసుకున్న భారత సంతతి మహిళ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. కెనడాలోని వాల్‌మార్ట్ ఉద్యోగి, భారత సంతతి మహిళ గురుప్రీత్ కౌర్‌ను సహ ఉద్యోగి ఓవెన్లో నెట్టి హత్య చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదవశాత్తూ గురుప్రీత్ కౌర్ ఓవెన్లో పడిందని సహ ఉద్యోగులు చెబుతున్నారు. బాధితురాలి కుటుంబీకులు మాత్రం కావాలనే ఓపెన్ ఓవెన్లో నెట్టారని ఆరోపిస్తున్నారు. దీనిపై కెనడా పోలసులు స్పందించాల్సి ఉంది.