బ్రెజిల్‌లోని రియో డి జనిరో వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో సమాలోచనలు చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
‘నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ను కలవడంతో ఎంతో సంతోషంగా ఉంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పని చేయడంపై చర్చించినట్లు వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు సమష్టిగా పని చేస్తామని అన్నారు.
ఏడాది ప్రారంభంలో పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహించారని మెక్రాన్‌ను మోదీ ప్రశంసించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ అయిన ప్రధాని మోదీ, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరచాలని భావిస్తున్నట్లుగా మోదీ తెలిపారు. ఇటలీ, యూకే, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్ సహా పలు దేశాధినేతలతో కూడా మోదీ సమావేశం అయ్యారు.