మణిపుర్ అల్లర్లు అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపుర్‌లోని జిరీబామ్ జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక సమీక్ష నిర్వహించారు.అల్లర్లు వెంటనే అదుపు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో 50 కంపెనీల అదనపు బలగాలను తరలించాలని హోం మంత్రి ఆదేశించారు.
మణిపుర్‌లో మైతేయి తెగకు చెందిన ముగ్గురు వ్యక్తులను ఉగ్రవాదులు చంపి నదిలో పడేసిన తరవాత అక్కడ మరోసారి హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మంత్రులు,ఎమ్మెల్యేల ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అల్లర్లు అదుపు చేసేందుకు కర్ఫ్యూ విధించినా ఆందోళనకారులు వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మణిపుర్ సమైక్యతా సంరక్షణ కమిటీ పిలుపు మేరకు ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు.
ఆదివారంనాడు మైతేయి తెగకు చెందిన ఆందోళనకారుడు చనిపోయాడు. దీంతో అల్లర్ల మరింత విస్తరించే ప్రమాదముందనే నిఘా వర్గాల సమాచారంతో అదనపు బలగాలను రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది. ఆదివారంనాడు కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలను నిరసనకారులు ధ్వంసం చేసి దోచుకున్నారు. స్వాతంత్ర్య ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేసి దోచుకున్నారు.
జిరీబామ్ జిల్లాలో అల్లర్లను అదుపు చేసేందుకు ఇప్పటికే కేంద్రం 218 కంపెనీల బలగాలను పంపింది. వీరికి అదనంగా మరో 50 కంపెనీల బలగాలు రెండు రోజుల్లో అక్కడకు చేరుకోనున్నాయి. ఇంఫాల్ లోయలో కర్ఫ్యూ విధించినా మణిపుర్ సమైక్యత సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు.