కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)గా కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. సంజయ్ మూర్తి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. కాగ్ చీఫ్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే మొదటిసారి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్‌గా నియమించింది. సంజయ్‌మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం ఎంపీగా పనిచేశారు. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరపున అమలాపురం లోక్ సభ నుంచి విజయం సాధించారు. ఆయన కూడా ఐఏఎస్ అధికారి కావడంతో కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.
సంజయ్‌మూర్తి 24 డిసెంబర్ 1964లో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రులు. 1989లో ఐఏఎస్ గా హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషించారు.
గరిష్ఠంగా ఆరేళ్లు, లేదంటే 65 ఏళ్ళ వయసు సంజయ్ మూర్తి పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత కాగ్ గా గిరీశ్‌చంద్ర ముర్ము ఉండగా, ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది.