ఆంధ్రప్రదేశ్ శాసనసభ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇందుకు అవసరమైన గత చట్టాన్ని ప్రభుత్వం సవరించగా అసెంబ్లీ ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు- 2024 బిల్లును పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదించిన తర్వాత ఎలాంటి చర్చా లేకుండానే సభ్యులు ఆమోదించారు.
1960 దశకంలో అప్పటి ప్రభుత్వాలు జనాభా నియంత్రణలో కఠినంగా వ్యవహరించాయి. ప్రభుత్వ పథకాలు, ఎన్నికల్లో పోటీకి సంతానంతో ముడిపెడుతూ పలు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు చట్టాలు చేశాయి. కుటుంబ నియంత్రణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అనర్హులుగా ప్రకటిస్తూ చట్టం చేశారు.
1955 మున్సిపల్ కార్పొరేషన్ల చట్టంలోని సెక్షన్ 21(బి), అలాగే 1965 మున్సిపాల్టీల చట్టం లోని సెక్షన్ 13(బి) లను చొప్పిస్తూ ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు -1994ను ఏపీలో తీసుకొచ్చారు. 1994లో జరిగిన ఈ సవరణ మేరకు ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ సవరణను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారనుంది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్పై ఎఫ్ఐఆర్ నమోదు