కర్ణాటక సంగీత శిఖరం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పేరిట యేటా ప్రదానం చేస్తున్న సంగీత కళానిధి పురస్కారాన్ని ఈ యేడాది టిఎం కృష్ణకు ఇవ్వడాన్ని నిలువరించాలని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెస్ పేరు లేకుండా అవార్డును టిఎం కృష్ణకు ఇచ్చుకోవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి జయచంద్రన్ అనుమతించారు.
ఈ యేడాది సంగీత కళానిధి పురస్కారాన్ని టిఎం కృష్ణకు ప్రదానం చేయాలని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మనవడు వి శ్రీనివాసన్ కోర్టుకెక్కారు. మ్యూజిక్ అకాడెమీ ఆ అవార్డును ఎమ్మెస్ పేరిట ప్రదానం చేస్తోంది. అయితే ఆమె తన వీలునామాలో తన పేరిట ఎలాంటి స్మారకాలు, ట్రస్టులు, ఫౌండేషన్లు పెట్టరాదని స్పష్టంగా రాసింది. ఆమె ఆఖరి కోరికను పట్టించుకోకుండా, ఆమె పేరును, వారసత్వాన్నీ దుర్వినియోగం చేస్తున్నారని శ్రీనివాసన్ వాదించారు.
టిఎం కృష్ణ చాలాసార్లు ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని దారుణంగా అవమానించాడు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి 20వ శతాబ్దపు అతిపెద్ద మోసం అని వ్యాఖ్యానించాడు. భక్తురాలిలాంటి బార్బీడాల్ అని వెటకరించాడు. అలాంటి కామెంట్స్ చేసిన వ్యక్తికి ఎమ్మెస్ పేరిట పురస్కారం ఇవ్వడం సరికాదని శ్రీనివాసన్ వాదించారు.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి లాంటి మహానుభావురాలి కోరికను గౌరవించడం ముఖ్యమని, అలా చేయడమే ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళి కాగలదని జస్టిస్ జయచంద్రన్ అన్నారు. ‘‘ఎమ్మెస్ను ఎవరైనా నిజంగా గౌరవిస్తుంటే, ఆమె కోరిక, ఆమె ఆదేశం తెలిసిన తర్వాత, ఆమె పేరు మీద అవార్డు ఇవ్వడాన్ని కొనసాగించకూడదు’’ అని తేల్చిచెప్పారు.
శ్రీనివాసన్ పిటిషన్ను తిరస్కరించాలంటూ మ్యూజిక్ అకాడెమీ పెట్టుకున్న దరఖాస్తును కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎమ్మెస్ వీలునామాకు వారసుడైన శ్రీనివాసన్కు ఆమె పేరిట అవార్డు ఇవ్వడాన్ని సవాల్ చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సంగీతకళానిధి పురస్కారానికి టిఎం కృష్ణను ఎంపిక చేయడాన్ని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సమర్ధించుకుంది. అవార్డు గ్రహీత ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ఆ ప్రక్రియలో అకాడెమీ గవర్నింగ్ బాడీ ప్రభావం, ప్రమేయం ఏమీ ఉండవని చెప్పుకొచ్చింది. 2005లో ఆ అవార్డు మొదలుపెట్టినప్పటినుంచి నేటివరకూ ఆ అవార్డుకు ఎమ్మెస్ కుటుంబసభ్యులు ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదని వివరించింది.
టిఎం కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సంగీత కళానిధి పురస్కారం ఇచ్చుకోడంలో అభ్యంతరం ఏమీ లేదని, అయితే దానికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పేరు మాత్రం వాడవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎమ్మెస్ సంగీత వారసత్వంతో సంబంధం లేకుండా కృష్ణను విడిగా సన్మానించుకోవచ్చని తేల్చిచెప్పింది.