ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా దహేజ్వర్ గ్రామంలో నవంబర్ 15న మూడు అస్థిపంజరాలు దొరికాయి. వాటిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అవి ఒక మహిళ, ఆమె ఇద్దరు సంతానానికి చెందినవని తేల్చారు. ఆ ముగ్గురినీ హత్య చేసాడన్న ఆరోపణపై పోలీసులు ముక్తార్ అన్సారీ అనే వ్యక్తిని ఇవాళ అరెస్ట్ చేసారు.
ముక్తార్ అన్సారీ ఝార్ఖండ్‌లోని బార్గఢ్ ప్రాంత నివాసి. ఈ హత్యల వెనుక ప్రధాన సూత్రధారి అతనే అని పోలీసులు నిర్ధారించారు. ముక్తార్ అన్సారీ తమ్ముడికి మరణించిన కుటుంబంలోని 17ఏళ్ళ అమ్మాయితో ప్రేమవ్యవహారం ఉందని భావిస్తున్నారు. దానివల్ల తమ్ముడు తమ కుటుంబానికి డబ్బులు పంపించడం లేదని ముక్తార్ ఆరోపించారు.
మృతులను ముస్కాన్ (17), ఆమె సోదరుడు మింటూ (6), ఆమె తల్లి కౌసల్య (35)గా గుర్తించారు. వాళ్ళు కుసుమి అనే ప్రాంతంలో నివసించేవారు. ముక్తార్ సోదరుడు ఆరిఫ్ అదే ప్రాంతంలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను మైనర్ హిందూ బాలిక అయిన ముస్కాన్‌ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసాడు. ఆ వ్యవహారం వల్లనే ఆరిఫ్ ఇంటికి డబ్బులు సరిగ్గా పంపించడం లేదని ముక్తార్ అనుమానించాడు.
సెప్టెంబర్ 27న ముక్తార్ అన్సారీ కుసుమి ప్రాంతానికి వెళ్ళాడు. ముస్కాన్, ఆమె తల్లికి ఏదో కట్టుకథ చెప్పి వారిని ఎలాగోలా ఒప్పించి తనవెంట తీసుకువెళ్ళాడు. దహేజ్వర్ గ్రామంలోని ఒక పాడుబడిన ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో వారిపై గొడ్డలితో దాడి చేసి చంపేసి, వారి శవాలను దగ్గరలో ఉన్న వాగులో పడేసాడు. కుళ్ళిపోయిన శవాలు సుమారు రెండు నెలల తర్వాత, మొన్న శుక్రవారం నాడు దొరికాయి. శవాలను గుర్తించిన తర్వాత పోలీసులు మొబైల్ కాల్స్, లొకేషన్ వివరాలు, ఇతర ఆధారాలను బట్టి ముక్తార్ అన్సారీని పట్టుకున్నారు. ఎట్టకేలకు ఇవాళ అరెస్ట్ చేసారు.