భారతదేశ ప్రజాస్వామ్యంపై చీకటిమచ్చ ఎమర్జెన్సీ. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి, దాని మాటున పాల్పడిన అరాచకాలెన్నో. ఆ ఎమర్జెన్సీయే ఇతివృత్తంగా కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి, సహనిర్మాతగా వ్యవహరించిన చిత్రం వివాదాల్లో పడి విడుదల అవకుండా ఆగిపోయింది. ఆ సినిమాకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదల తేదీని కంగనా రనౌత్ ఇవాళ ప్రకటించింది.
ఎమర్జెన్సీ సినిమాకు ఆది నుంచీ గండాలే ఎదురయ్యాయి. సినీరంగంలో ఎవరినీ లెక్కచేయని తరహాతో మొండిదని పేరు గడించిన కథానాయిక, హిందుత్వ విధానాలను సమర్ధించడం ద్వారా బాలీవుడ్‌కు మింగుడుపడని నటి, ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ టికెట్ మీద గెలిచి ఎంపీ అయిన కంగనా రనౌత్ ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తీయడం మొదలుపెట్టినప్పటినుంచీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
సినిమా సెన్సార్ విషయంలోనూ చాలా జాప్యమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి దాదాపు ఏడాది కావొచ్చింది. ఈ సినిమాలో తమను తక్కువ చేసి చూపించారంటూ ఒక వర్గం వారు మధ్యప్రదేశ్ కోర్టును ఆశ్రయించారు. వారి వాదనలను విన్న కోర్టు, సెన్సార్ బోర్డుకు కొన్ని సూచనలు చేసింది. సెన్సార్ బోర్డు చిత్ర నిర్మాణ సంస్థకు కొన్ని సూచనలు చేసింది. వాటికి సినిమా నిర్మాతలు ఒప్పుకున్నారు. దాంతో ఎమర్జెన్సీ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఆ సినిమా 2025 జనవరి 17న విడుదలవుతుందని కంగనా ఇవాళ ప్రకటించింది.
దేశంలో ఎమర్జెన్సీ విధించి, ప్రజలందరూ ఆ గందరగోళంలో ఉండగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి సామ్యవాద, లౌకికవాద అన్న పదాలను చేర్చింది. వాటి ఫలితంగా భారతదేశంలోని హిందువులు ఎదుర్కొన్న అవస్థలకు లెక్కేలేదు. ఇంక ఎమర్జెన్సీ సమయంలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఇతరత్రా వివాదాస్పద నిర్ణయాలతో ఇందిరాగాంధీ, నియంత అన్న చెడ్డపేరు మూటగట్టుకొంది.