కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత మొదటిసారి సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీలో పనిచేస్తోన్న అన్యమతస్తులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. హిందూ మతేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయనున్నారు. తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన స్థలంలో నిబంధనలు ఉల్లింఘించి భవనాలు నిర్మించారని విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదికతో లీజులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తిరుపతి అలిపిరి వద్ద పర్యాటక శాఖ ముసుగులో కేటాయించిన 20 ఎకరాల లీజును రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలిపిరి వద్ద 20 ఎకరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవలోకం పేరుతో దేవాలయాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలిపిరి వద్ద పర్యాటకశాఖ పేరుతో 20 ఎకరాలు లీజుకు తీసుకుని ముంతాజ్ హోటల్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్లు బీఆర్ నాయుడు గుర్తుచేశారు. ఆ లీజులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
తిరుపతి నగర వాసులకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనం కల్పిస్తామని చెప్పారు. క్యూ లైన్లతో పనిలేకుండా తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం లభించనుంది. లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యి నాణ్యత పరిశీలించేందుకు అత్యాధునిక ల్యాబు అందుబాటులోకి రాబోతోందని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.
తిరుమలలో అన్యమత ప్రచారానికి తావులేదని టీటీడీ బోర్డు ఛైర్మన్ తేల్చి చెప్పారు. ఎవరైనా అలాంటి ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
తిరుమల దర్శనానికి వచ్చి, దర్శనం తరవాత మీడియాతో రాజకీయాలు మాట్లాడుతున్నారని, విమర్శలకు దిగుతున్నారని ఇక నుంచి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులకు 2 గంటల్లో దర్శన భాగ్యం కల్పించేలా ఏఐ టెక్నాలజీ సహాయం తీసుకోనున్నామన్నారు. అన్నదాన భవనాలను ఆధునికీకరించేందుకు టీవీఎస్ కంపెనీ ముందుకు వచ్చిందని టీటీడీ బోర్డు ప్రకటించింది.
ప్రత్యేక దర్శనం పేరుతో అమ్ముతోన్న 10 వేల టికెట్లనుంచి వచ్చే ఆదాయాన్ని టీటీడీ బోర్డుకు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.అన్నదాన వంటశాలను ఆధునీకీకరించే ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది. తిరుమలలోని చెత్తడంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను మూడు నెలల్లో ఖాళీ చేయించాలని నిర్ణయించారు. భక్తులు దర్శనం సమయానికి క్యూలైన్లోకి వచ్చేలా టికెట్లు ఇస్తామన్నారు.