పాకిస్తాన్‌లోని ఇస్లాంకోట్ ప్రాంతంలో ఇద్దరు హిందూ మైనర్ బాలికల విషాదకర మరణాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించారు. మరణించిన బాలికలను హేమ (15), వెంతి (17)గా గుర్తించారు. వారి శవాలు ఒక చెట్టుకు వేలాడుతూ దొరికాయి.
ఆ సంఘటన ఇస్లాంకోట్ స్థానిక హిందువుల్లో భయాందోళనలు కలగజేసాయి. ఆ సంఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులు ఎదుర్కొంటున్న దురాగతాలపైన కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
‘‘పాకిస్తాన్‌లోని మన హిందూ సోదరీమణులు అలాంటి అఘాయిత్యాలకు లోనై ప్రాణాలనే కోల్పోడాన్ని చూస్తే చాలా బాధ కలుగుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని హిందువుల దుస్థితి గురించి అలాంటి వార్తలు చూసిన ప్రతీసారీ మనసుకు చాలా ఆవేదన కలుగుతోంది. హేమ, వెంతి కోసం కన్నీళ్ళతో ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఆయన ఎక్స్ మాధ్యమంలో ట్వీట్ చేసారు.
పాకిస్తాన్లో హిందూ బాలికల మృతి గురించి ఇన్సైట్ యుకె అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. అలాంటి సంఘటనలను అడ్డుకోలేని యుఎన్ఎచ్ఆర్‌సి వంటి సంస్థల వైఫల్యాన్ని దుయ్యబట్టింది. ‘‘థార్పార్కర్‌లోని ఇస్లాంకోట్‌లో ఒక విషాదకర సంఘటన జరిగింది. హేమ (15), వెంతి (17) అనే ఇద్దరు హిందూ అమ్మాయిలు ఒక చెట్టునుంచి వేలాడుతూ శవాలై కనిపించారు. ఆ సంఘటన స్థానికంగా భయం కలుగజేసింది. ఇస్లాంలోకి మతం మారాలంటూ ముస్లిముల ఒత్తిళ్ళను, బలవంతాలనూ నిరంతరాయంగా ఎదుర్కొంటూన్న పాకిస్తానీ హిందువుల, ఇతర మైనారిటీల భద్రత, హక్కుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆందోళన పడుతున్నారు’’ అని ఇన్సైట్ యూకే ట్వీట్ చేసింది.