వచ్చే యేడాది ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో అక్కడి పాలకపక్షం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఇవాళ బీజేపీలో చేరారు.
కైలాష్ గెహ్లాట్ నిన్న ఆదివారం ఆప్‌కు రాజీనామా చేసారు. పార్టీకి దశాదిశా లేకుండా పోయిందని, పార్టీ అంతర్గత సవాళ్ళతో కొట్టుమిట్టాడుతోందనీ ఆందోళన వ్యక్తం చేసారు. ఆయన ఇవాళ కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ఇతర బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఆ సందర్భంగా మాట్లాడుతూ కైలాష్ గెహ్లాట్, ‘‘ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టడం నాకు అంత సులువైన నిర్ణయం ఏమీ కాదు. నేను అన్నాహజారే రోజుల నుంచీ ఆప్‌తో ఉన్నాను. ఢిల్లీ ప్రజల కోసమే పనిచేసాను. నేను ఏ ఒత్తిళ్ళకో లొంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నానని భావిస్తున్నవారికి ఒకటే చెబుతున్నా. నేను నా జీవితం మొత్తం మీద ఏ నిర్ణయమూ ఏ ఒత్తిడిలోనూ తీసుకోలేదు. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. నేను ఆప్‌లో చేరడం కోసం నా కెరీర్‌ను వదిలేసుకున్నాను. మేమందరం ఒక సిద్ధాంతం కోసం కలిసాం. మా ఏకైక ప్రయోజనం ఢిల్లీ ప్రజలకు సేవ చేయడమే’’ అని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో విలువల పతనం తనను బాధించిందని కైలాష్ గెహ్లాట్ చెప్పారు. ‘‘దేనికోసమైతే మేమందరం చేతులు కలిపామో ఆ ప్రయోజనం ఇప్పుడు కనిపించడం లేదు. రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో నిరంతరాయంగా ప్రతీ చిన్న విషయంలోనూ ఘర్షణ పడుతూనే ఉంటే ఇంక రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?’’ అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటేనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని నా దృఢవిశ్వాసం. అందుకే బీజేపీలో చేరాను. ప్రధానమంత్రి దార్శనికత, ఆయన విధానాల ప్రేరణతో ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేస్తాను’’ అని కైలాష్ గెహ్లాట్ ప్రకటించారు.