మణిపూర్‌లో హింసకు సంబంధించిన మూడు ప్రధానమైన కేసుల దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఎ స్వీకరించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఎ ఆ కేసులను మణిపూర్ పోలీసుల నుంచి స్వీకరించింది.
ఈమధ్య మణిపూర్‌లో సామాజిక అశాంతికి, హింసాత్మక సంఘటనలకు కారణమైన మూడు ప్రధానమైన సంఘటనలకు సంబంధించిన కేసులను విచారించే బాధ్యతను కేంద్ర హోంశాఖ ఎన్ఐఎకు అప్పజెప్పింది. వాటిలో ఒకటి జిరిబాంలో సిఆర్పిఎఫ్ దళాలపై కుకీ మిలిటెంట్లు చేసిన దాడి, ఆ సందర్భంగా ఇరుపక్షాల మధ్యా జరిగిన కాల్పుల సంఘటన. ఆ ఘటనలో కనీసం పదిమంది కుకీ మిలిటెంట్లు హతమయ్యారు.
మరో ఘటనలో అదే జిరిబాంలో ఆరుగురు వ్యక్తుల కిడ్నాప్ అయ్యారు. కొద్దిరోజులకు వారి మృతదేహాలు లభించాయి. దానికి సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఆ రెండు కేసులను కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు.
మణిపూర్‌లో పెరిగిపోతున్న అస్థిరతను నియంత్రించడానికి కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ మూడు కేసులనూ మణిపూర్ పోలీసుల నుంచి ఎన్ఐఎకు బదిలీ చేసింది. ఇప్పుడు ఎన్ఐఎ ఆ మూడు కేసుల్లోనూ హింసాకాండకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలోని శాంతి భద్రతల మీద ఆ మూడు కేసులు స్థూలంగా చూపిన ప్రభావం గురించి దర్యాప్తు చేస్తుంది.
గత కొద్దిరోజులుగా మణిపూర్‌లో రెండు ప్రధానతెగలు కుకీ-జో-హ్మర్, మెయితీ తెగలకు చెందిన సాయుధులైన ఉద్యమకారులు ఘర్షణలకు పాల్పడుతున్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయింది. దానికి సంబంధించిన ప్రధానమైన మూడు కేసులను ఎన్ఐఎకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ నవంబర్ 16, శనివారం నాడు వెల్లడించింది.
మణిపూర్‌లోని పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇవాళ కూడా మరో సమావేశం జరగనుంది.