జి-20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రియో డి జెనీరోలో వేదపండితులు సంస్కృత మంత్రాలు ఉచ్చరిస్తూ స్వాగతం పలికారు.
అన్ని వయసుల స్త్రీపురుషులతో కూడిన వేదపండితుల సమూహం సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో శ్లోకాలు చదువుతూ మోదీని ఆహ్వానించారు. వారి సామూహిక పారాయణాన్ని మోదీ ఆసక్తిగా విన్నారు.
‘భారతదేశపు సంస్కృతి, మతం, కళలు, తత్వశాస్త్రంపై బ్రెజిల్‌వాసులకు ఆసక్తి ఎక్కువ. రామకృష్ణ మిషన్, ఇస్కాన్, సత్యసాయిబాబా ఆశ్రమం, మహర్షి మహేష్ యోగి ఆశ్రమం, భక్తివేదాంత ఫౌండేషన్ వంటి హిందూ సంస్థల శాఖలు ఆ దేశంలో క్రియాశీలంగా ఉన్నాయి. భారతీయ తాత్వికత, ఆధ్యాత్మికతలతో పాటు హుషారైన పండుగలు, వన్నెచిన్నెల జానపద సంప్రదాయాలపై బ్రెజిల్ వాసులకు మక్కువ’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
మోదీ రాక సందర్భంగా ఆయన బస చేసే హోటల్ దగ్గర డాన్సర్లు గుజరాతీ దుస్తులు ధరించి దాండియా నృత్యాలతో స్వాగతం పలికారు. బ్రెజిల్‌లోని ప్రవాస భారతీయులు మోదీకి కానుకలు ఇచ్చారు. ఆయనను ఆహ్వానిస్తూ భారత జెండాలను ప్రదర్శించారు.
భారతీయ వేదాలు అభ్యసించిన బ్రెజిలియన్లు తమపై వాటి ప్రభావాన్ని వివరించారు. ‘‘పదేళ్ళ క్రితం నా జీవితం అర్ధరహితంగా ఉండేది. అప్పుడు నేను వేదాలు అధ్యయనం చేయడం ప్రారంభించాను. అప్పుడే నన్ను నేను తెలుసుకోగలిగాను’’ అని జెనిఫర్ షోల్స్ అనే వేదపండితురాలు చెప్పింది. ‘‘బ్రెజిల్‌లో చాలామంది వేద సంస్కృతి, భారతీయ సంస్కృతితో తాదాత్మ్యం చెందుతారు. వేదమంత్రాలను వినడంతోనే వారి హృదయాలు సంతోషంతో, శాంతితో నిండిపోతాయి. ఇక్కడ చాలామంది పిల్లలు సంస్కృతం, వేదమంత్రాలు, రామాయణ మహాభారత కథలు నేర్చుకుంటున్నారు’’ అని జోనాస్ మాసెట్టి అలియాస్ ఆచార్య విశ్వనాథ వివరించారు.
ఇవాళ, రేపు బ్రెజిల్‌లో జి-20 దేశాల అధినేతల 19వ సమావేశాలు జరగనున్నాయి. వాటిలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం బ్రెజిల్ చేరుకున్నారు.