బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ అల్పపీడనం నవంబరు 26వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అంచనా వేశారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురేసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు, రేపు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబరు 23న ఏర్పడే అల్పపీడనం కదలికలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది వాయుగుండంగా మారి ఏ దిశగా పయనిస్తుందనే దానిపై వాతావరణ శాఖ అంచనాలు రూపొందిస్తోంది. మరో రెండు రోజుల్లో అల్పపీడనంపై మరింత స్పష్ట రానుంది.
గడచిన 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో 12 మి.మీ వర్షపాతం నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు చేరింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా మెరుపులు, ఉరుములతో జల్లులు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.