ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. నైజీరియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ద ఆర్డర్ ఆఫ్ ద నైజర్ గ్రాండ్ కమాండర్‌ను బహుకరించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నైజీరియా చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ నెల 18,19వ తేదీల్లో బ్రెజిల్లో జరగనున్న జీ 20 దేశాల సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
నైజీరియా అత్యున్నత పురస్కారం అందుకున్న విదేశీయుల్లో ప్రధాని మోదీ రెండవ వారు. 1969లో క్వీన్ ఎలిజిబెత్‌కు ఈ పురస్కారం ఇచ్చారు. ఆ తరవాత ఒక విదేశీ నేతకు పురస్కారం దక్కడం ఇదే మొదటిసారి. మోదీకి ఇది 17వ అంతర్జాతీయ పురస్కారం కావడం గమనార్హం.
ఈ నెల 17న నైజీరియా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ బ్రెజిల్ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే జీ 20 సమావేశాల్లో పాల్గొని అనంతరం గయానా పర్యటనకు వెళతారు. గయానా అభ్యర్థన మేరకు ప్రధాని మోదీ ఆదేశంలో ఒక రోజు పర్యటించనున్నారు.