ఈశాన్య రాష్ట్రం మణిపుర్ మరోసారి భగ్గుమంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసంపై నిరసనకారులు దాడులకు దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు.ముఖ్యమంత్రి అల్లుడి నివాసం, ముగ్గురు మంత్రులు, మరో ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై కూడా ఆందోళనకారులు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. అల్లర్లు అదుపు చేసేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి.అయినా అల్లర్లు అదుపులోకి రాలేదు.
జిరిబామ్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల మైతేయ్ శిబిరం నుంచి ఆరుగురు కనిపించకుండా పోయారు. కొద్ది రోజులకే వారు సమీపంలోని నదిలో శవాలై తేలారు. దీంతో మైతేయ్ తెగ ప్రజలు ఆందోళనలు ఉదృతం చేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులకు దిగుతున్నారు.
మణిపుర్ అల్లర్లపై కేంద్రం స్పందించింది. దాడులకు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బలగాలను ఆదేశించారు. అదనపు బలగాలను అల్లర్లు జరిగిన ప్రదేశాలకు పంపించారు. నిర్వాసితుల శిబిరాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఆందోళనలు విరమించాలని భద్రతాధికారులు హెచ్చరించారు.