సైబర్ కేటుగాళ్లు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. డిజిటల్ అరెస్టులు, స్టాక్ మార్కెట్లో రెట్టింపు లాభాలంటూ వల విసురుతున్నారు. వారి వలలో చిక్కి ఉన్నత చదువులు చదివిన వారు కూడా చిక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ చిత్రపురి కాలనీకి చెందిన ఓ అకౌంటెంట్ సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.10 కోట్లకుపైగా పోగొట్టుకున్నాడు. సైబర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
హైదరాబాద్ చిత్రపురి కాలనీకి చెందిన ఓ అకౌంటెంట్ ఫోన్కు గత నెల 17న ఒక వాట్సప్ మెసేజ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వెల్త్ గ్రూపు పేరుతో వచ్చింది. ఆ తరవాత చేతన్ అనే వ్యక్తి కాల్ చేశాడు. తమ గ్రూపు ప్రైమ్ అకౌంట్ తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించాడు. తరవాత మరో మహిళ కాల్ చేసి తమ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రైమ్ ఖాతా తెరవాలని కోరింది. వారు కోరిన విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని బాధితుడు అక్టోబరు 17న లక్ష పెట్టుబడి పెట్టాడు. ఆ వెంటనే రూ.19వేలు లాభం వచ్చినట్లు యాప్లో చూపించారు. ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
నవంబరు 10 నాటికి రూ.10కోట్ల 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనికి మొత్తం రూ.24 కోట్లు వస్తాయంటూ యాప్లో చూపించారు. డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే మరో రూ.3 కోట్లు పెట్టుబడి పెడితేనే పెట్టుబడుల ఉపసంహరణ కుదురుతుందని చెప్పారు.
ఆలస్యంగా మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ అరెస్టులు, స్టాక్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారని అలాంటి వారి మాటలు నమ్మ వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.