ఒక వ్యక్తి ఆస్తిని లాక్కోడానికి కర్ణాటక వక్ఫ్ బోర్డు చేసిన ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు అడ్డుకుంది. ఆ వివాదాన్ని వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. కర్ణాటక వక్ఫ్ బోర్డ్ 1976లో తామే ప్రైవేటు ఆస్తి అని ప్రకటించిన ఒక భూమిని వెనక్కు తీసుకోడానికి ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాటిని హైకోర్టు నిలువరించింది.
జబీర్ అలీ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంజిఎస్ కమల్ ఆ తీర్పు ఇచ్చారు. వక్ఫ్ బోర్డు గత పాలకులు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి బోర్డు, ఒక కమిటీ వేసి మార్చేయడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పాత బోర్డు నిర్ణయాన్ని తిరగదోడాలంటే ట్రిబ్యునల్‌కు వెళ్ళాల్సిందేనని చెప్పింది. పాత బోర్డు, ఇప్పటి ట్రిబ్యునల్ సమాన స్థాయి కలిగిన వ్యవస్థలని తేల్చింది.
బెంగళూరులో షా మహమ్మద్ రజా అలీ అనే వ్యక్తి నియంత్రణలో కొన్ని ఆస్తులుండేవి. వాటిలో ఒక శ్మశానం కూడా ఉంది. అవి వక్ఫ్ ఆస్తులు అని 1965లో అప్పటి మైసూరు వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఆ ఆస్తులు రజా అలీ నియంత్రణలోనే ఉండేవి. ఆ విషయమై 1975లో వక్ఫ్ బోర్డు రజా అలీకి నోటీసులు పంపింది కూడా. అయితే ఆ వ్యవహారంలో దర్యాప్తు జరిగాక, 1976లో కర్ణాటక వక్ఫ్ బోర్డు ఆ ఆస్తులు రజా అలీ వ్యక్తిగత ఆస్తులు అని నిర్ణయించి ప్రకటించింది. ఆ ఆస్తులను వక్ఫ్ బోర్డు జాబితా నుంచి తొలగించాలి అని 1977లో ఆదేశాలు కూడా జారీ చేసింది.
అప్పటి వక్ఫ్ బోర్డు ఆదేశాల తర్వాత ఇటీవలి వరకూ ఆ ఆస్తుల విషయంలో ఎలాంటి సమస్యా లేదు. అయితే 2020 నవంబర్‌లో కర్ణాటక వక్ఫ్ బోర్డు రజా అలీ కొడుకు జబీర్ అలీకి నోటీసులు పంపింది, అతనిపై వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారుడు అని ఆరోపణ చేసింది. జబీర్ అలీ వక్ఫ్ బోర్డును మోసం చేసి ఆ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించింది. దానిపై జబీర్ అలీ కోర్టుకు వెళ్ళాడు. మరోవైపు ఆ వ్యవహారంపై వక్ఫ్ బోర్డు ఒక లీగల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 1976 నాటి వక్ఫ్ బోర్డు ఆదేశాలను రద్దు చేసింది. జబీర్ అలీ దగ్గరున్నది వక్ఫ్ ఆస్తేనని ప్రకటించింది.
దాంతో జబీర్ అలీ హైకోర్టును ఆశ్రయించాడు. 1976లో ముగిసిపోయిన వ్యవహారాన్ని వక్ఫ్ బోర్డు ఇప్పుడు తిరగదోడుతోందని, అది సరికాదనీ జబీర్ వాదించాడు. పైగా, ప్రస్తుత న్యాయసూత్రాల ప్రకారం అప్పటి వక్ఫ్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను మార్చాలంటే ట్రిబ్యునల్ లేదా అంతకంటె ఉన్నతస్థాయి న్యాయస్థానమే మార్చగలదని వాదించాడు.
వక్ఫ్ బోర్డు, ఒక కమిటీ ద్వారా తన ఆస్తిని స్వాధీనం చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నం తప్పు అని జబీర్ అలీ వాదించాడు. అతని వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అతని ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా చేసిన ప్రకటనను రద్దు చేసింది. ఒకవేళ వక్ఫ్ బోర్డు ఆ ఆస్తి తమదేనని నిరూపించదలచుకుంటే వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని స్పష్టం చేసింది.